Bonda Uma: నాపై నిందలు వేస్తే ఊరుకునేది లేదు... వీడియో పంచుకున్న బోండా ఉమ

  • విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి
  • బోండా ఉమపై ఆరోపణలు
  • విజయవాడ సెంట్రల్ లో జరిగింది కాబట్టి తనను టార్గెట్ చేస్తున్నారన్న ఉమ
  • జూన్ 4 తర్వాత ఎవరినీ వదిలిపెట్టేది లేదంటూ వార్నింగ్
Bonda Uma shares video

విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి ఘటనలో తనపై ఆరోపణలు వస్తుండడం పట్ల టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరో ఆకతాయి రాయి విసిరితే తనపై నిందలు వేస్తున్నారని, ఇలాంటి అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనను టార్గెట్ చేస్తున్నవారికి జూన్ 4 తర్వాత సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. 

"విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆ సంఘటన అనుకోకుండా జరిగింది. తాను ఎందుకు అలా చేసిందీ ఆ కుర్రాడు కారణం కూడా చెప్పాడు. వాళ్ల ఇంటి పక్కనే అన్న క్యాంటీన్ ఉండేదట. అన్న క్యాంటీన్ తీసేశారు, మాకు రూ.300 ఇస్తామని ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు... మా అమ్మకు రూ.200 ఇస్తామని ఇవ్వలేదు. ఇలా డబ్బులు ఇవ్వకుండా ఎవడికి వాడు వెళ్లిపోయాడన్న బాధతో, కోపంతో చీకట్లో ఒక రాయి విసిరాడు. దురదృష్టవశాత్తు అది సీఎంకు తగిలింది... అంతే తప్ప, అదేమంత పెద్ద విషయం కాదు. 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది కాబట్టి... వాళ్లకొక అవకాశం వచ్చినట్టుగా భావించి నన్ను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇందులో వాస్తవాలు ఉంటాయి, సాక్ష్యాధారాలు ఉంటాయి... ఎలాంటి పరిస్థితుల్లో నా పేరును తీసుకువస్తూ కేసును పెట్టించారో, ఎవరు కేసు బుక్ చేశారో, ఎవరు విచారణ చేస్తున్నారో వారంతా నా పేరును ప్రస్తావిస్తే మాత్రం జూన్ 4 తర్వాత కచ్చితంగా వారంతా కేసుల్లో ఇరుక్కుంటారు. 

కోడికత్తి డ్రామా లాగానే ఈ ఘటనతోనూ రాష్ట్రవ్యాప్తంగా సానుభూతి పొందాలనుకుంటున్నారు. చిన్న గాయాన్ని పెద్దదిగా చూపిస్తున్నారు. ఇక్కడ నేను గెలుస్తున్నాను... గెలవలేని వెల్లంపల్లి ఏదో విధంగా నా మీద కేసు పెట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ న్యాయం, ధర్మం అనేవి కచ్చితంగా ఉన్నాయి. 

ఇందులో నా పాత్ర ఉంటే నేను దేనికైనా సిద్ధం. ఉరేసినా, బహిరంగ శిక్ష విధించినా బాధపడను. అలాకాకుండా, నన్ను ఇరికించాలి, నా ద్వారా పార్టీని ఇబ్బంది పెట్టాలి అని చూస్తే ఎవరినీ వదిలిపెట్టం" అని బోండా ఉమ స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ మీడియా ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

More Telugu News